వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలి

వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలి

-వీఆర్ఏల సంఘం నాయకులు
-నరసరావుపేట ఆర్డీఓకు వినతిపత్రం

నరసరావుపేట, ఆంధ్రప్రభ: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ డిమాండ్ చేశారు. జిల్లాలోని వీఆర్ఏ లు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె బాలకృష్ణ కు గురువారం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

అనంతరం బందగీ సాహెబ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా విఆర్ఏల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల నుండి వీఆర్ఏల వేతనాలు పెరగలేదని, ఇతర రాష్ట్రాల్లో పేస్కేలు అమలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గౌరవ వేతనం తోనే పని చేయిస్తున్నారన్నారు. అక్రమ నైట్ వాచ్‌మెన్, అటెండర్ డ్యూటీలతో పాటు రీ-సర్వే పేరుతో ఇతర గ్రామాల్లో విధులు వేయడం వల్ల విఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

చదువుకున్న వీఆర్ఏలు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఖాళీగా ఉన్న విఆర్ఓ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. విఆర్ఏలకు పే స్కేలు అమలు చేయడంతో పాటు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల వినతిపై స్పందించిన ఆర్డీఓ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అటెండర్, నైట్ వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకుంటామని, సంబంధిత సర్కులర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వీఆర్ఏల సంఘ నాయకులు, మహిళా ప్రతినిధులు వి తదితరులు పాల్గొన్నారు.