మానవత్వం చాటిన మోత్కూర్ పోలీసులు
మానవత్వం చాటిన మోత్కూర్ పోలీసులు
- తప్పిపోయిన బాలుడిని చిల్డ్రన్స్ హోమ్ కి తరలింపు
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు పోలీసులు మరోసారి తమ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల మహారాష్ట్రకి చెందిన ఓ అనాధ మహిళను చౌటుప్పల్ లోని అనాధ ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్న పోలీసులు, మరో అడుగు ముందుకు వేసి తప్పిపోయిన బాలుడిని చిల్డ్రన్స్ హోమ్ కి తరలించి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో తిరుగుతున్న ఓ బాలుడిని గుర్తించిన పోలీసులు అతని తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఓ బాలుడు షాపుల వద్ద తిరుగుతూ ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మోత్కూరు పోలీసులు బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అయితే బాలుడు తన పేరు బోగి అభి (12), తన తల్లి పేరు లక్ష్మి అని మాత్రమే చెప్పగలిగాడు. తన తల్లితో కలిసి జనగామ ప్రాంతం నుంచి బస్సులో మోత్కూరుకు వచ్చానని, చిన్నపిల్లల వస్తువులు విక్రయిస్తూ ఉంటామని తెలిపాడు. అనంతరం తల్లి కనిపించకపోవడంతో షాపుల వద్ద తిరుగుతున్నానని బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు మైనర్ కావడంతో పాటు పూర్తి వివరాలు తెలియకపోవడంతో, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అతడిని భువనగిరి చిల్డ్రన్ కేర్ హోంకు తరలించారు. బాలుడి తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మైనర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించే పిల్లల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సి ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
