మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికై కాంగ్రెస్ కు పట్టం కట్టండి

పంచాయతీ రాజ్ మంత్రి, భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ సీతక్క, తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్
- గెలుపు మీ బాధ్యత – అభివృద్ధి నా బాధ్యత
- మోత్కూర్ గడ్డ – అభివృద్ధికి అడ్డా
మోత్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికై కాంగ్రెస్ కు పట్టం కట్టాలని , మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మోత్కూరు మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, భువనగిరి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ దళసరి సీతక్క అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదేనని, మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత తనదేనని, మోత్కూర్ గడ్డ అభివృద్ధికి అడ్డాగా మారుస్తామని అన్నారు. మోత్కూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మున్సిపల్ శాఖ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయని, తాను సీఎం దృష్టికి తీసుకెళ్లి మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అధిక నిధులు తెప్పించి , పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రతి గల్లి గల్లి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వాలలో కనీసం ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో తొలి విడతలో 4 లక్షల 50 వేలు మంజూరు చేశారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు ,సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరిట అమలు చేస్తూ మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులు ,పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడంతోపాటు బస్సులకు ఒనర్లను చేశామని తద్వారా మహిళలకు నెలకు రూ.70 వేల ఆదాయం వస్తుందన్నారు. రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకునేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రూ. 1200 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందజేశామన్నారు . స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షల బీమా కల్పించామని, 400 మంది సభ్యులకు రూ. 40 కోట్ల భీమా చెక్కులు పంపిణీ చేశామన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళలు సైతం ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల వరకు లోన్ మాఫీ చేసి మృతుల కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు.ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న మహిళలకు రూ. లక్ష అదనంగా శ్రీనిధి రుణాలు అందజేసి మహిళలను బలోపేతం చేస్తున్నామన్నారు . తాను ఓ మహిళా మంత్రిగా సిరిసిల్ల నేత కార్మికులతో నేయించిన చీరలు ప్రస్తుతం ఇందిరమ్మ చీరలుగా పంపిణీ చేశామని , గతంలో బిఆర్ఎస్ హయాంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు చేనులు, చెల్కలో, నారుమడులలో దిష్టిబొమ్మలకు బెదురుగా పెట్టారని ఎద్దేవా చేశారు .నీళ్లు ,నిధులు, నియామకాల కోసం 14 ఏళ్లు ఉద్యమం చేపట్టి, 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ,కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయ పదవులతో ఉద్యోగాలు పొంది లబ్ధిపొందారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించినట్లు తెలిపారు . ఏప్రిల్ లో రెండో విడత గా ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాయమాటలు నమ్మి ఓట్లు వేయవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే సామెల్ కన్న ఊరు, చదువుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని , నిధుల కోసం తనకు విన్నవించారన్నారు . మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మున్సిపాలిటీలో మహిళా సంఘాల, అంగన్వాడి భవనాలు, బ్రిడ్జిలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం చేస్తామన్నారు. పట్టణాలతో పాటు పల్లెలను సైతం అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు .పేదలకు సన్న బియ్యం రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు.
తెలంగాణ ను దోచుకున్న కేసీఆర్ కుటుంబం…. ఎమ్మెల్యే సామెల్
తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలో కేసీఆర్ కుటుంబంలో తండ్రి, కొడుకు, బిడ్డ,అల్లుడు అందినకాడికి దోచుకున్నారని, ఆ దోచుకు దోచుకుని దాచుకున్నది పంచుకోవడానికి ప్రస్తుతం పంచాయతీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు . తెలంగాణ రాష్ట్రంపై ఎనిమిది లక్షల కోట్ల అప్పులు వేశారన్నారు దీంతో చరిత్రలో బి ఆర్ ఎస్ కనుమరు కావడం ఖాయమన్నారు ఇక్కడి ఓ దొంగ ఎమ్మెల్యే ఇసుక,భూ దందా చేసి బిక్కేరు ఇసుక డబ్బులు బడా నేతలకు అప్పజెప్పారన్నారు. గత ఎన్నికల్లో తనపై ఓడిపోయిన కిషోర్ తొక్కుడు తొక్కితే పరార్ అయ్యారని, ఆ దోపిడి దొంగకు బుడ్డ మంత్రి పెద్దదిక్కని కిశోరా..చిచోరా పనులు మానుకో అని ఎద్దేవా చేశారు. మోత్కూర్ లో రోడ్ల అధ్వానంగా మారితే తాను ఎమ్మెల్యే అయ్యాక రూ. 25 కోట్లతో మోత్కూర్ లో రోడ్లు అద్దంలా మార్చామని, అంగడి బజార్లో సైతం సిసి రోడ్లు నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.15 కోట్లకు సంబంధించి ఎన్నికల అనంతరం టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు చేపడతామన్నారు .మోత్కూర్లో 169 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించామన్నారు. మోత్కూర్ బిక్కేరు వాగులోకి గత ఏడాది రబీ ,యాసింగి పంటలకు గోదావరి నీళ్లు అందించానన్నారు .మోత్కూర్ పెద్ద చెరువులో డ్రైనేజీ వాటర్ కలుస్తుందని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి చెరువు ప్రక్షాళన చేపడుతామన్నారు.మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ , సిపిఐ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మోత్కూర్ ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని , సీసీ రోడ్లు ,డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు.గత ఎన్నికల్లో కెసిఆర్ 10 ఏళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడి రేవంత్ రెడ్డికి అండగా నిలిచారన్నారు . కెసిఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బొజ్జ సంధ్యారెడ్డి , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి , మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ ,గుండగొని రామచంద్రు , సిపిఐ జిల్లా నాయకులు యానాల దామోదర్ రెడ్డి ,చెడే చంద్రయ్య ,అన్నెపు వెంకట్, నాయకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి , చింతల విజయభాస్కర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు .
శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంత్రి సీతక్క పూజలు-ప్రచార ర్యాలీ ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి సీతక్క స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి పాత బస్టాండ్, చెరువు కట్ట మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే సామెల్ , కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
