యాదగిరిగుట్టపై భానుడి భగభగలు

యాదగిరిగుట్టపై భానుడి భగభగలు

అధికారుల ఉదాసీనతతో భక్తుల పాదాలకు నిప్పుల పరీక్ష

యాదగిరికొండ, ఆంధ్రప్రభ : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. వేసవి కాలం దృష్ట్యా కొండపై భక్తుల సౌకర్యార్థం కనీస ఏర్పాట్లు చేయడంలో దేవస్థాన యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం భారీ స్థాయిలో చలువ పందిళ్లు, షెడ్లు ఏర్పాటు చేసేవారని, కానీ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం వల్ల అత్యంత తక్కువ మోతాదులో మాత్రమే టెంట్లు కనిపిస్తున్నాయని భక్తులు మండిపడుతున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు, ప్రధాన ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో పరచిన నల్ల రంగు రాతి బండలు సూర్యతాపానికి నిప్పు కణాల్లా మారుతున్నాయి. పాదరక్షలు లేకుండా దర్శనానికి వెళ్లాల్సిన భక్తులు, కనీస చలువ పందిళ్లు కూడా లేకపోవడంతో ఈ వేడెక్కిన బండలపై అడుగు వేయలేక, తలదాచుకోవడానికి నీడ దొరకక అల్లాడిపోతున్నారు. సరైన చలువ పందిళ్లు లేకపోవడంతో గత్యంతరం లేక భక్తులు గోపురాల నీడ చాటున, చిన్నపాటి చెట్ల కింద చేరుతూ సేద తీరుతున్న దృశ్యాలు అధికారుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.

కేవలం నీడ సౌకర్యమే కాకుండా, తాగునీటి విషయంలోనూ భక్తులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కొండపై అక్కడక్కడా ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాల వద్ద చల్లని నీరు రావాల్సింది పోయి, ఎండ తీవ్రతకు పైపులు వేడెక్కి వేడి నీళ్లు వస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. దాహంతో అలమటిస్తున్న భక్తులకు ఈ వేడి నీరు తాగలేక తీరని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ప్రోటోకాల్ ఆఫీస్ ప్రాంగణంలో బ్యాటరీ వెహికల్ స్టాండ్ పక్కన అందుబాటులో ఉండే మంచినీటి స్టాల్స్ ఈ ఏడాది ఎక్కడా కనిపించడం లేదు.

ఈ కీలక ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో భక్తులు నీళ్ల కోసం అన్వేషించాల్సిన దుస్థితి ఏర్పడింది. పసిపిల్లలను ఎత్తుకుని, వృద్ధులను పట్టుకుని దర్శనం కోసం వెళ్లే భక్తులు పాదాలు కాలి ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని క్షేత్ర సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో నేలపై కూలింగ్ మ్యాట్లు పరచడం లేదా నిరంతరం నీటిని చిలకరిస్తూ నేలను చల్లబరచడం వంటి ముందస్తు చర్యలు చేపట్టాలి. కానీ, యాదగిరిగుట్టపై ఇలాంటి ఏర్పాట్లు నామమాత్రంగా కూడా లేకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

టెండర్ల ప్రక్రియలో జరిగిన జాప్యం వల్లనో లేదా నిర్వహణ లోపం వల్లనో కానీ, భక్తులకు అందాల్సిన కనీస సౌకర్యాలు అందడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థాన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రవ్యాప్తంగా అవసరమైన చోట అదనపు చలువ పందిళ్లను నిర్మించాలని, నాణ్యమైన కూలింగ్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే గతంలో ఉన్న ప్రాంతాల్లో మంచినీటి స్టాల్స్‌ను పునరుద్ధరించి, భక్తులకు చల్లని తాగునీటిని అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల ఈ ఉదాసీన వైఖరిని సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో క్షేత్ర సందర్శకుల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.