ఎకరాకు రూ.28 లక్షల పరిహారం..

ఎకరాకు రూ.28 లక్షల పరిహారం..

  • ఏపీఐఐసీ భూసేకరణలో రైతులకు భరోసా
  • మామిడి తోటలు, బోర్‌వెల్లు, కట్టడాలకు అదనపు పరిహారం
  • భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు
  • పారదర్శకంగా భూసేకరణ.. రైతులు ఆందోళన చెందొద్దు
  • శ్రీసిటీతో ప్రాంతీయ అభివృద్ధి వేగం పెరిగింది జిల్లా కలెక్టర్
  • పరిహారంపై అభ్యంతరాలుంటే ఆర్బిట్రేషన్‌కు అవకాశం
  • కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం చేపడుతున్న భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.28 లక్షల నష్టపరిహారం అందజేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, విద్యార్హత కలిగిన రైతుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రైతులతో భూసేకరణ, నష్టపరిహారం, ప్రభుత్వ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

రైతులకు న్యాయం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల్లో ఏపీఐఐసీ పరిశ్రమల అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణలో భాగంగా రైతులకు న్యాయమైన పరిహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. భూములకు ఎకరాకు రూ.28 లక్షల పరిహారం చెల్లించడమే కాకుండా భూముల్లో ఉన్న మామిడి చెట్లు, ఇతర వృక్షాలు, బోర్‌వెల్లు, షెడ్లు, గోడలు, కట్టడాలు వంటి స్థిరాస్తులకు ప్రత్యేక అంచనాల ప్రకారం అదనపు పరిహారం కూడా చెల్లిస్తామని కలెక్టర్ వెల్లడించారు. భూ పరిహారం, అదనపు పరిహారం కలిపి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

ఉపాధి అవకాశాలు
అదేవిధంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు శ్రీ సిటీ పరిధిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఏపీఐఐసీ ద్వారా చేపడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడానికి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

వేలాది మందికి ఉపాధి
శ్రీ సిటీ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని కలెక్టర్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు ప్రాంతాలు గతంతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు, మౌలిక వసతులు ఏర్పడి ప్రాంతీయ అభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. గతంలో కూడా రైతులు సహకరించి శ్రీ సిటీ అభివృద్ధికి భూములు ఇచ్చారని, ఆ సహకారంతోనే ప్రస్తుతం రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా శ్రీ సిటీ ఎదిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా రైతులు సహకరిస్తే భవిష్యత్తులో వారి పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

రికార్డులు సిద్ధం చేసుకోవాలి..

రైతులు తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, వెబ్‌ల్యాండ్ రికార్డులు, ఇతర ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలు ఉన్న రైతులు చట్టబద్ధంగా ఆర్బిట్రేషన్‌కు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ముందుగా పరిహారం స్వీకరించి, అనంతరం ఆర్బిట్రేషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. కోర్టు కేసులు, చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని, రాళ్లకుప్పం ప్రాంతానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు పరిష్కారమైన వెంటనే అక్కడ కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి స్పందించిన జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సత్యవేడు తహసీల్దార్ శివప్రసాద్, ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటీపాకం గ్రామాల వీఆర్వోలు, భూసేకరణ విభాగ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.