Service Road | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు….

Service Road | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు….
Service Road | బంగారుపాళ్యం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో మరోసారి దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని రాష్ట్రాన్ని కుదిపేసింది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలే ఇదే మార్గంలో జరిగిన ప్రమాదం మర్చిపోకముందే మరోసారి ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు (46), ఆయన భార్య లక్ష్మి (42), కుమార్తె అద్విక (16) కలిసి బెంగళూరు నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయలుదేరారు. ప్రయాణం మధ్యలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం జాతీయ రహదారి వద్ద ప్రమాదం సంభవించింది.

పలమనేరు వైపు నుండి చిత్తూరు దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు సర్వీస్ రోడ్డులో ఆగి ఉండగా, అతివేగంతో వచ్చిన కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యి, బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన కార్ డ్రైవర్‌ను అత్యవసర సేవల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో అతివేగం, డ్రైవర్ అలసట ప్రమాదానికి ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దైవ దర్శనం కోసం బయలుదేరిన కుటుంబం ఇలా మార్గమధ్యలోనే మృత్యువాత పడటం విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామిని దర్శించడానికి బయలుదేరితే ప్రాణాలే పోయాయి… మాకు మిగిలింది కన్నీళ్లు మాత్రమే అంటూ వారి రోదనలు హృదయ విదారకంగా మారాయి.
ఇటీవల ఇదే జిల్లాలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన ప్రజల మదిలో ఇంకా నిలిచే ఉంది. అలాంటి ఘటన మరువకముందే మళ్లీ అదే తరహా ప్రమాదం చోటుచేసుకోవడం చిత్తూరు జిల్లాలో రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
