మక్తల్-పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు

మక్తల్-పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు

-98 శాతం రైతుల సహకారంతో భూసేకరణ పనులు పూర్తి

-రైతులకు మార్కెట్ విలువ కంటే 6 రెట్లు పరిహారం చెల్లించాం

రైతుల సహకారంతోనే ప్రాజెక్టు పనులు వేగవంతం

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ:
మక్తల్ – నారాయణపేట – కొడంగల్ జీవో 69 ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే ఎత్తిపోతల పథకంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, ఊట్కూర్ మండలంలో 38 వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి గ్రామ శివారులోని బాపూర్ శివారులో కొనసాగుతున్న ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సహకారంతోనే భూ సేకరణ పనులు ఇప్పటికీ 98 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. అధికారులు ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలని నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం
ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరాకు రూ. 20 లక్షలు పరిహారం చెల్లించారని గుర్తు చేశారు. రైతులు సహకరించడం వల్లే ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. రైతులకు ప్రభుత్వం మార్కెట్ విలువ కంటే ఆరు రెట్లు అధిక పరిహారం అందించిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.

నారాయణపేటను శశ్యామలం చేయడమే లక్ష్యం
వెనుకబడిన నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, గతంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న నారాయణపేట అన్ని రంగాల్లో వెనుకబడి ఉండగా, సొంత జిల్లాను అభివృద్ధి చేయాలని ఎన్ని అడ్డంకులు వచ్చినా నారాయణపేట జిల్లాను శశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి బీడు భూములు సాగు యోగ్యంలోకి తెచ్చి అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే ఏడాది నాటికి ఊట్కూర్ మండలంలో 38 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టాలని అధికిరులను ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని అన్నారు.