Liquor | జూన్ 2 నుంచి ధరల పెంపు
Liquor | జూన్ 2 నుంచి ధరల పెంపు
Liquor | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలో మందు బాబులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుంది. జూన్ 2 నుంచి మద్యం ధరలను పెంచాలని నిర్ణయించింది. లిక్కర్ తో పాటుగా బీర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం దాదాపు సిద్దమైంది. వివిధ బ్రాండ్లు, బీర్ల ధరలను సవరిస్తూ దాదాపు 10% నుంచి 15% వరకు రేట్లు పెంచాలని ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా భారీగా అదనపు ఆదాయం సమకూరనుంది. ఇందు కోసం శ్లాబ్ సిస్టమ్ అమలు చేయాలనే తాజా ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడనుంది. అధికారిక ప్రకటన దిశగా తుది కసరత్తు జరుగుతోంది.
పశ్చిమాసియాలో వార్ కారణంగా ఇంధన ధరలు పెరగడం, ఎల్పీజీ సహజ వాయువు కొరత ఏర్పడటంతో దీనివల్ల లిక్కర్ సీసాల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరగడంతో తాము నష్టపోతున్నామని, ధరలను సవరించాలని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం లిక్కర్, బీర్ల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం నియమించిన త్రిసభ్య ధరల నిర్ధారణ కమిటీ ఇప్పటికే దీనిపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రాకుండా, అలాగని కంపెనీలకు నష్టం రాకుండా శ్లాబ్ సిస్టమ్ ద్వారా ధరలను 10% నుండి 30% వరకు పెంచాలని ప్రతిపాదించారు. సాధారణ బ్రాండ్లు ఫుల్ బాటిల్‌పై రూ. 60 వరకు, ప్రీమియం బ్రాండ్లు రూ. 100 వరకు, హై-ఎండ్ బ్రాండ్లు రూ. 120 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే ఎండల తీవ్రత, ఐపీఎల్ సీజన్ వల్ల రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న బీర్ల ధరలు కూడా 12% నుండి 15% వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
ఈ ధరల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు నెలకు కనీసంగా రూ. 150 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 3,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది.
