మే 20న మెడికల్ షాపుల బంద్
మే 20న మెడికల్ షాపుల బంద్
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:
మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మెడికల్ షాపుల బంద్‌కు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎల్కతుర్తి మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు మంగళవారం మండల కేంద్రంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా సాగుతున్న మందుల విక్రయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో మార్కెట్లోకి ప్రవేశించి చిన్న మెడికల్ షాపుల వ్యాపారాలను, వారి జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల నకిలీ మందుల విక్రయాలు పెరిగే ప్రమాదం ఉందని, దీనిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ ఔషధ విక్రయాల కోసం జారీ చేసిన జీఎస్ఆర్ నిబంధనలను సైతం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో భాగంగా మే 20న మండలంలోని అన్ని ఔషధ విక్రయ శాలలు (మెడికల్ షాపులు) స్వచ్ఛందంగా బంద్ పాటిస్తాయని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మందుల దుకాణాలు మూసివేయడం వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి తాము ఎంతగానో చింతిస్తున్నామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారుల మనుగడను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు నందనం రవి, గోడిశాల కిషన్, జనగాని ప్రవీణ్ తదితర నిర్వాహకులు పాల్గొన్నారు.
