కార్తీక పౌర్ణమి నది స్నానం.. కోటి జన్మల పుణ్యఫలం…

- త్రిపురి పూర్ణిమ”, “దేవ దీపావళి గా మరో పేరు
- శివ కేశవుల పూజలకు ప్రత్యేకం
- బుధవారం కార్తీక పౌర్ణమి
మహదేవపూర్, (ఆంధ్రప్రభ) : కార్తీక పౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసంగా పురాణాలూ చెప్తున్నాయి. ఈ పవిత్రత, ఆచరణలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శివుడిని, విష్ణువును ఆరాధించడాన్ని ఎంతో శ్రేష్టంగా పరిగణిస్తారు.
ఈరోజున నది స్నానం చేసి ఒక్క దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ పౌర్ణమి రోజు శివాలయాలలో రుద్రాభిషేకం, మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించడం వల్ల ఆ పరమశివుడు ప్రసన్నుడై భక్తుల అభీష్టాలను తీరుస్తాడని గాడమైన విశ్వాసం.
ప్రత్యేకంగా “కేదారేశ్వర వ్రతం” పాటించేవారు ఎక్కువగా ఉంటారు. సత్యనారాయణ వ్రతం చేయడం కూడా శ్రేష్ఠంగా భావిస్తారు .దీపాలు వెలిగించడం, నదిలో ప్రాతఃకాల స్నానం చేయడం, బంధువులకు పుణ్యపుస్తకాలు, సౌభాగ్యద్రవ్యాలు (పసుపు, కుంకుమ, తాంబూలం) ఇచ్చేయడం ఆదర్శంగా చెబుతారు.
పౌరాణిక ప్రాధాన్యత ఈ పర్వదినాన్ని “త్రిపురి పూర్ణిమ”, “దేవ దీపావళి” అని కూడా అంటారు. బుధవారం కార్తీక పౌర్ణమి కావడంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తున్నారు.
పురాణ కథనాల ప్రకారం.. శివుడు త్రిపురాసురుని సంహరించిన రోజు ఇదే అనీ, అలాగే కార్తికేయుడు తారకాసురుని సంహరించిన దినంగా కూడా భావిస్తారు.
పారాయణం, దీపారాధన, వనభోజనాలు వంటి ఆనవాయితీలు ప్రసిద్ధి. విశ్వాసాలు ఫలాలు ఈ రోజు నది స్నానం చేసినవారికి, దీపారాధన చేసినవారికి, శివవిష్ణువులను ఆరాధించినవారికి అనేక పుణ్యఫలాలు, శుభసంపదలు, పాపక్షయం కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ పూర్ణిమను పరమ పవిత్రమైన రోజు అనడంలో అర్థం, కార్యాచరణల్లో ఆధ్యాత్మికత, పుణ్యము పొందే అవకాశమే ప్రధానాంశం. ఈ నేపథ్యం వలన కార్తీక పౌర్ణమి అనేది భారతీయులకు విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా, సంప్రదాయికంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.
వివిధ రాష్ట్రాల నుండి భక్తుల రాక
పౌర్ణమి రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవస్థానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి కీ అభిషేకాలు అర్చనలు చేస్తారు. ఆ పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు.
త్రివేణి సంగమంలో అరటి డొప్పల తో దీపాలు
ఈ క్షేత్రంలో మూడు నదులు త్రివేణి సంగమంలో కలయికైనా త్రివేణి సంఘమ గోదావరి నది ఉండడం విశేషం. కార్తీక పౌర్ణమిలో ప్రాతః కళ సమయంలో నది స్నానం చేసి గోదావరి నదిలో అరటి డోప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదలడం వంటి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేసి గోదావరి అమ్మవారికి చీరె, సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి వేడుకుంటారు.
కాళేశ్వరం దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి రోజు గోదావరి మాతాకీ ప్రత్యేక పూజలు నిర్వహించి పంచ హారతులు కార్యక్రమం చేస్తున్నారు.



