నేడే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు

నేడే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు
సర్వాంగా సుందరంగా ముస్తాబైన బాపూ మ్యూజియం
గతాన్ని గుర్తు చేస్తూ.. భవిష్యత్తుకు బాటలు వేసే ప్రత్యేక కార్యక్రమాలు
విజయవాడ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న సోమవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు బాపూ మ్యూజియంలో ఏర్పాట్లు చేశారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేసేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. విద్యార్థులు, యువత, చరిత్రాభిమానులను ఆకట్టుకునేలా పురాతన కళాఖండాలు, చారిత్రక వస్తువులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.
మ్యూజియంల ప్రాముఖ్యత, చరిత్ర పరిరక్షణ అవసరాన్ని తెలియజేసే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రదర్శనలు, విద్యార్థుల కోసం సృజనాత్మక పోటీలు నిర్వహించనున్నారు. గత వైభవాన్ని గుర్తు చేస్తూనే, భవిష్యత్తు తరాలకు చరిత్రను చేరువ చేసే దిశగా పలు కార్యక్రమాలను రూపొందించారు. ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, జిల్లా అధికార యంత్రాంగం.. జిజ్ఞాస ఆర్ట్ వెర్స్, ఇన్‌టాక్, ఆర్టీఐహెచ్, జిల్లా యువజన సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా హెరిటేజ్ వాక్…..
సోమవారం మ్యూజియం ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6.30 గంటలకు బాపూ మ్యూజియం నుంచి మొఘల్రాజపురం గుహలు వరకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు బాపూ మ్యూజియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆపై మేధోమధన చర్చలతో పాటు చిత్రలేఖనం,హెరిటేజ్ క్విజ్, ఫొటోగ్రఫీ తదితర పోటీలు ఉంటాయి. రోజంతా బాపూ మ్యూజియంలో ప్రత్యేక గైడెడ్ టూర్లు సందర్శకులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. లేజర్ షో కూడా ఆకట్టుకోనుంది. ఔత్సాహికులు ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించవచ్చు. సోమవారం సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ టాలీవుడ్ గాయకుల సంగీత విభావరి ఉత్సాహపరచనుంది.
