పిచ్చికి ఫుల్‌స్టాప్… ప్రతిభ రాజకీయాలు మొదలు

పిచ్చికి ఫుల్‌స్టాప్… ప్రతిభ రాజకీయాలు మొదలు

అగ్గిపెట్టె మీదైనా నా బొమ్మే అన్న జగన్
విద్యార్థుల మార్కులతోనే ప్రభుత్వ ముద్ర.. ఇదే లోకేష్ మార్క్!
ప్రచారం కోసం కాదు… పేద పిల్లల భవిష్యత్తుకోసం పాలన..
ర్యాంకులే రిప్లై… పాత రాజకీయాలకు కొత్త తరహా కౌంటర్
ఐ టీడీపీ నేత పొట్లూరు దర్శిత్

విజయవాడ, ఆంధ్రప్రభ : అన్నింటిలోనూ తన ఫోటోలు వేయించి నీచ రాజకీయాలు చేసిన జగన్ పాలనుకు భిన్నంగా నేడు ప్రతిభా రాజకీయాలు జరుగుతున్నాయని ఐటీడీపీ సీనియర్ నేత పోట్లూరు దర్శిత్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో విద్యా రంగం కేంద్రబిందువుగా మారిందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న నాయకులు ప్రతి పథకం, ప్రతి వస్తువు, ప్రతి ప్రకటనలో తమ ఫోటో ఉండాలని పోటీ పడ్డారని, అగ్గిపెట్టె మీద కూడా బొమ్మ ఉండాలనే స్థాయికి వ్యక్తిగత ప్రచారం వెళ్లిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదువు చెప్పేది గురువులని, రాత్రింబవళ్లు కష్టపడేది విద్యార్థులని, కానీ క్రెడిట్ మాత్రం రాజకీయ నాయకుల ఖాతాలో పడే పరిస్థితిని రాష్ట్రం చూసిందన్నారు.

అది నాయకత్వం కాదని, ప్రచార వ్యామోహానికి పరాకాష్ట అని విమర్శించారు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యాశాఖ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిందని దర్షిత్ అన్నారు. ఇటీవల విడుదలైన విద్యాశాఖ ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం, మంత్రి ఫోటో కూడా లేకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైందన్నారు. ఆ ప్రకటనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలకే స్థానం కల్పించడం నిజమైన ప్రజా పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

“తండ్రి ఫోటో వేసుకునే అవకాశం ఉన్నా, తన ఫోటోతో ప్రచారం చేసుకునే హక్కు ఉన్నా… వాటన్నింటినీ పక్కన పెట్టి పేద విద్యార్థులనే రాష్ట్రానికి స్టార్‌లుగా నిలబెట్టడం లోకేష్ మార్క్ రాజకీయం” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నిలబెట్టడం అంటే భవనాలకు రంగులు వేయడం కాదని, విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే అసలైన సంస్కరణ అని తెలిపారు.

“పేదవాడి బిడ్డ చదువుకుంటే నా ఫోటో ఎందుకు… వాడు ర్యాంకు కొడితే నా ప్రచారం ఎందుకు… వాడు గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టే” అనే ఆలోచనతో పనిచేసే నాయకుడు లోకేష్ అని కొనియాడారు. గత పాలకులు ప్రచారం కోసం పాకులాడితే, నేటి పాలకులు ప్రతిభ కోసం పరితపిస్తున్నారని, తక్కువ కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకురావడం లోకేష్ దార్శనికతకు నిదర్శనమని పొట్లూరు దర్షిత్ పేర్కొన్నారు.

Leave a Reply