ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న నిరసన

ప్రజా వ్యతిరేక విధానాలపై వినూత్న నిరసన

రాప్తాడు, ఆంధ్రప్రభ : దేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు మండల కేంద్రం నందు సీపీఐ మండల కార్యదర్శి ఆర్.రవీంద్ర ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ప్రజలు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతున్న ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ద్విచక్ర వాహనాలను రోడ్డుపై తోసుకుంటూ (నెట్టుకుంటూ) వెళ్ళి తమ నిరసనను తెలియజేశారు.

ఈ సంధర్భంగా మాట్లాడుతూ అధికారం చేపట్టకముందు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేదే లేదంటూ గొప్పలు చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం దక్కించుకున్నాక ప్రజలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపుతూ ఇటీవల కాలంలోనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.1,000 పెంచి సామాన్యుల నడ్డి విరిచారని అన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి పరోక్షంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు బతకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై అత్యధికంగా సెస్ (శిస్తు) విధిస్తూ ప్రజలను దోచుకుంటోందని ధ్వజమెత్తారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పోటీపడి మరీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని తక్షణమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ రూరల్ మండల కార్యదర్శి నరేష్ సహాయ కార్యదర్శులు చలపతి దుర్గాప్రసాద్ ఏఐవైఎఫ్ ప్రసాద్ ధనుంజయ శాఖ కార్యదర్శులు ప్రసాద్ సంజీవులు పెద్దన్న రఫీ కుళ్లాయప్ప రసూల్ సహాయ కార్యదర్శులు చౌడప్ప రెడ్డప్ప నరేంద్ర వెంకటేష్ చందు హరీష్ తదితరులు పాల్గొన్నారు.