ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించనున్న కొత్త సేవ బీకే పార్థసారథి చేతుల మీదుగా ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రవేశపెట్టిన ఈ కొత్త రైలు సేవతో ధర్మవరం ప్రాంత ప్రజలకు దీర్ఘదూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని ఎంపీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ బీకే పార్థసారథి, ధర్మవరం నుంచి తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, యాత్రికులు ఈ రైలు ద్వారా సులభంగా ప్రయాణించగలరని చెప్పారు. ధర్మవరం వంటి ప్రధాన పట్టణానికి మరిన్ని రైల్వే సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోందని వివరించారు.

కొత్తగా ప్రారంభమైన ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ నంబర్ 11099 ప్రతి ఆదివారం ధర్మవరం నుంచి ఉదయం 5:55 గంటలకు బయలుదేరి బెంగళూరు మీదుగా పలు ప్రధాన పట్టణాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలు పూల, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్ మార్గంగా మహారాష్ట్రలోని నాందేడ్ వరకు వెళుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత బలపడనుంది. అదేవిధంగా నాందేడ్ నుంచి ధర్మవరం వచ్చే రైలు నంబర్ 11086 ప్రతి శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది.

ఈ సర్వీసు ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు సమయపాలనతో కూడిన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ధర్మవరం ప్రాంత ప్రజలు ఈ రైల్వే సేవ ప్రారంభంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాందేడ్‌లోని ప్రముఖ గురుద్వారాలను సందర్శించే భక్తులకు, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యాపార కార్యకలాపాలకు కూడా ఈ సేవ దోహదపడుతుందని స్థానిక వ్యాపారులు తెలిపారు.

రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ సేవను ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికుల స్పందన ఆధారంగా మరిన్ని సదుపాయాలు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. కొత్త రైలు సేవ ప్రారంభంతో ధర్మవరం రైల్వే స్టేషన్ ప్రాధాన్యత మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply