తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించండి..

తిరుపతి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు పరిష్కరించండి..
నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి బ్యూరో, ఆంధ్రప్రభ : తిరుపతి పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారం, అలాగే డిజిటల్ విద్యా, సైబర్ పరిశోధన రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి, రేణిగుంట, గూడూరు ప్రాంతాలకు సంబంధించిన పలు రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరారు.
రేణిగుంట రైల్వే స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రధాన టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని, ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ కోరారు. ప్రయాణికుల కోసం మెరుగైన వసతులు, పార్కింగ్, కార్గో సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. శ్రీకాళహస్తి, నడికుడి రైల్వే లైన్ తుది దశ పనులను వేగవంతం చేయాలని కోరారు.
సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను గూడూరు నుంచి తిరుపతి వరకు పొడిగించాలని, దీని ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గూడూరులోని అంబేద్కర్ నగర్ అండర్‌పాస్ విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని, వెందోడు రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్, పూరి ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని కోరారు. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని కూడా వివరించారు.
డిజిటల్ విద్య, సైబర్ భద్రత రంగాల్లో తిరుపతిని జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో నైలెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు తిరుపతి విమానాశ్రయం సమీపంలోని ప్రతిపాదిత భూమిని త్వరగా స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, హాస్టళ్లు, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన “సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పాలసీ, లా అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్ సైబర్ స్పేస్” ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందించాలని కోరారు. తిరుపతికి సైబర్ పరిశోధన, డిజిటల్ ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని, కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
