తిరుపతి జిల్లాకు రెండు జాతీయ అవార్డులు..
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో రెండు అవార్డులు సాధించినందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. శుక్రవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొని “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మే నెల థీమ్‌గా “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” అంశంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రతి నెల మూడో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం”గా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరగనుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రజా ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో తిరుపతి జిల్లాకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు రావడంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
