జవహర్‌నగర్‌లో అగ్నిప్రమాదం

జవహర్‌నగర్‌లో అగ్నిప్రమాదం

  • ఇల్లు పూర్తిగా దగ్ధం.. రూ.11 లక్షల ఆస్తి నష్టం

జవహర్‌నగర్, ఆంధ్రప్రభ ; జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.11 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.

స్థానికుల వివరాల ప్రకారం, ఇంటి పనులు ముగించుకుని దేవుడి వద్ద దీపం వెలిగించి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బృందం, జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

ఇంటి యజమాని శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, స్వగ్రామంలో ఇల్లు నిర్మించేందుకు దాచిన రూ.4 లక్షల నగదు, మూడు తులాల బంగారం ఇంట్లోనే ఉండగా అగ్నికి ఆహుతయ్యాయి. అదేవిధంగా ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామాన్లు పూర్తిగా దగ్ధమవడంతో మొత్తం రూ.11 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవుడి వద్ద వెలిగించిన దీపం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.