పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

  • కేజేఎస్ పరిశ్రమతో 1,600 మందికి ఉపాధి
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్ర‌తినిధి,ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి శుక్రవారం నిర్వహించిన భూమిపూజలో ఆయన మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, ఎంపీలు సురేష్ షెట్కర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, కేజేఎస్ సంస్థ ఎండీ గిరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ “ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంగారెడ్డి ప్రాంతంలో వేలాది మహిళలకు ఉపాధి కల్పించే పరిశ్రమ రావడం ఆనందంగా ఉంద‌న్నారు. కేజేఎస్ పరిశ్రమ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుందని, అందులో 1,000 మంది మహిళలకు అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారని వెల్లడించారు.

ప్రధానంగా తొగర్‌పల్లి, అలియాబాద్, కొండాపూర్ ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభించనున్నదని, సంగారెడ్డి పరిసర ప్రాంతాల వారికి కూడా అవకాశాలు దక్కనున్నాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా ఉన్న సమయంలో బీడీఎల్, ఓడీఎఫ్ వంటి పరిశ్రమలు స్థాపించబడినట్లు తెలిపారు. అనంతరం బాగారెడ్డి, పి.రామచంద్రారెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ తండ్రి వంటి నాయకులు కూడా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు.

Leave a Reply