రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
మండలంలోని చిన్నకొండూరు గ్రామంలో శుక్రవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రభావతి రైతులకు సాగు మెళకువలపై పలు కీలక సూచనలు చేశారు.

రైతులు అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని, ఎకరానికి కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. వానాకాలం సాగుకు సంబంధించి ప్రభుత్వం గుర్తింపు పొందిన ‘సర్టిఫైడ్’ విత్తనాలనే వినియోగించాలని, పురుగు మందుల విషయంలోనూ జాగ్రత్త వహించాలని సూచించారు.

భూసారాన్ని పెంచేందుకు జీలుగ సాగు చేసి కలియదున్నాలని, నారుమడిలో కేవలం 2 కేజీల గుళికలు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. సాగు ఖర్చులను తగ్గించుకున్నప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆమె వివరించారు. మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులను పక్కన పెట్టి, సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు.

సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే రకమైన పంట వేయకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలని, అధిక లాభాలనిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య , చిన్నకొండూరు గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, పెద్దకొండూరు సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణ, పీఏసీఎస్ సీఈఓ వై రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply