గ్రంథాలయాలకు అంబేద్కర్ పుస్తకాల విరాళం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమతా బెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్కు సంబంధించిన పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థకు విరాళంగా అందజేశారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యకు ఫౌండేషన్ చైర్మన్, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ అనంతయ్య పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా అనంతయ్య మాట్లాడుతూ సమాజంలో అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు యువతకు చేరవేయడం అత్యంత అవసరమన్నారు.
అందుకే సంగారెడ్డి, జోగిపేట్, నారాయణఖేడ్, జహీరాబాద్, సదాశివపేట, పటాన్‌చెరు ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు అంబేద్కర్ రచనలు, ప్రసంగాల పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని, విద్యార్థులు, యువత పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పుస్తకాలు సమాజాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ అనంతయ్య, స్వర్ణలత దంపతులను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అభిషేక్, కంది మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగరాణి యాదవ్, ఉపాధ్యాయులు రాజు, పుండరీకం, న్యాయవాది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
