తిరుచానూరు రోడ్డు విస్తరణకు మాస్టర్ ప్లాన్

తిరుచానూరు రోడ్డు విస్తరణకు మాస్టర్ ప్లాన్
- పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
- ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ, పార్కింగ్ ఏర్పాట్లు
- టీటీడీ, తుడా సంయుక్తంగా రూపొందించిన ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష
- బ్రహ్మోత్సవాల దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రోడ్డు విస్తరణ, పార్కింగ్ ఏర్పాట్లపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్ఓ మురళీకృష్ణతో కలిసి తుడా, టీటీడీ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రోడ్డు విస్తరణ, పార్కింగ్ నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
భక్తులకు మెరుగైన దర్శన అనుభూతి కల్పించేలా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణం, పార్కింగ్ సదుపాయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని పేర్కొన్నారు. టీటీడీ జేఈవో, తుడా సీపీఓలు రోడ్డు నిర్మాణం, పార్కింగ్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్, ఏడీ సర్వేయర్ అరుణ్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ సుధాకర్ నాయక్, తుడా ఎస్‌ఈ రవీంద్ర, తుడా సీపీఓ దేవి, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


