పుస్తక పఠనం జ్ఞాన వికాసానికి పునాది

పుస్తక పఠనం జ్ఞాన వికాసానికి పునాది

  • సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు
  • యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
  • గ్రంథాలయ చైర్మన్ అంజయ్య

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యా వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా “లైబ్రరీ డే” పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పుస్తకాల ప్రదర్శనను డీఈవో పరిశీలించి అభినందించారు. విద్యార్థులు, యువత, పాఠకులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి మంచి మిత్రులని, గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను కూడా చదవాలని సూచించారు.

డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ యువతలో చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

Leave a Reply