తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది..

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది..

  • నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలి
  • కలెక్టర్ కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మణిక్ రావు విజ్ఞప్తి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన అత్యవసర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే, వెంటనే బోర్లను మంజూరు చేయాలని కోరారు.

అలాగే రహదారుల మరమ్మతులు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, మిగిలిపోయిన శనగలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఝరాసంఘం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి కోసం అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. అదేవిధంగా నిరుపేదలకు నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, అర్హులైన మైనారిటీ లబ్ధిదారులకు కుట్టు మిషన్లు ఎలాంటి ఆలస్యం లేకుండా అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి…

ఇకపోతే, పెండింగ్‌లో ఉన్న మాజీ సర్పంచ్‌ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply