హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామంతాపూర్ శాఖల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటవ తరగతి ప్రవేశాల కోసం గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి గొట్టిముక్కుల నాగసాగర్ తెలిపారు.

అభ్యర్థులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యులై ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు ఉండాలని తెలిపారు.

దరఖాస్తుదారులు ఆదాయ, నివాస, కుల, జనన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత తహసీల్దార్‌లచే జారీ చేయించుకోవాలి. అలాగే విద్యార్థులు 1-6-2019 నుంచి 31-5-2020 మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని, ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు.

కేవలం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ స్పాన్సర్ చేసిన ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనం చెల్లించబడుతుందని, స్వయంగా పాఠశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉపకార వేతనం వర్తించదని వెల్లడించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ఎటునాగారం ఐటిడిఏ ప్రాజెక్టు కార్యాలయంలో డ్రా నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.