Film Chamber | పర్సంటేజ్ వివాదంపై నిర్మాతలు-ఎగ్జిబిటర్ల చర్చలు

Film Chamber | పర్సంటేజ్ వివాదంపై నిర్మాతలు-ఎగ్జిబిటర్ల చర్చలు

Film Chamber | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కీలక సమావేశం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న పర్సంటేజ్ విధానం, రెంటల్ సిస్టమ్, ఓటీటీ విండో వివాదాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు నేతృత్వంలో సమావేశం కొనసాగుతోంది.

ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, నాగవంశీ, మైత్రీ రవి, సుప్రియ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే సునీల్ నారంగ్‌, నాగవంశీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిల్ రాజు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అనంతరం సునీల్ నారంగ్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంటల్ విధానం బదులు సినిమా కలెక్షన్లలో శాతం ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే పర్సంటేజ్ విధానం అమలు చేస్తే తమకు నష్టాలు వస్తాయని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో ముందుగా మెరుగైన వసతులు కల్పించాలని నిర్మాతలు సూచిస్తున్నారు. ఈ వివాదం ఇటీవల వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడంతో ఫిల్మ్ ఛాంబర్ అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.