Market Yard | 15రోజులుగా సిద్దిపేట రైతుల నిరీక్ష‌ణ‌

Market Yard | 15రోజులుగా సిద్దిపేట రైతుల నిరీక్ష‌ణ‌

ధాన్యం త‌ర‌లింపులో అమ‌లుకాని సర్కారు ఆదేశాలు
హ‌మాలీల ఆంక్ష‌లు.. ధాన్యం బస్తాల తరలింపు బంద్
ఇబ్బందులు ప‌డుతున్న అన్న‌దాత‌లు

Market Yard | సిద్దిపేట బ్యూరో, ఆంధ్రప్రభ : దేవుడు వరమిచ్చినా పూజారి అనుమతి ఇవ్వనట్లు ఉంది.. సిద్దిపేట రైతుల పరిస్థితి. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి , మంత్రులు, అధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో వివిధ ప్రాంతాల నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చారు. 15 రోజులు నుంచి అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మకమైన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయడానికి గోనె సంచులు లేక పది రోజుల నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల బుధవారం గోనె సంచులు వచ్చాయి. మార్కెట్ యార్డ్ లోని గిడ్డంగి వద్ద ధాన్యం తీసుకువచ్చిన రైతులకు గురువారం గోనెసంచుల పంపిణీ చేపట్టారు. సమాచారం అందుకున్న రైతులు గంటల తరబడి వరసలో నిలబడి గోనెసంచులు తీసుకుంటున్నారు.

Market Yard | ధాన్యం సంచులను లోడింగ్ చేయమని..

అమ్మకమైన ధాన్యాన్ని గోనెసంచులలో ప్యాక్ చేసి తరలించడానికి సిద్ధం చేయగా హమాలీలు లారీలలో ధాన్యం సంచులను లోడింగ్ చేయమని భీష్మించారు. ట్రాక్టర్ లో మాత్రమే ధాన్యం సంచులు లోడింగ్ చేస్తామని స్పష్టం చేయడంతో ఎన్నో తిప్పలు పడి తరలించడానికి సిద్ధమైన ధాన్యం బస్తాలు మార్కెట్లలో నిలిచిపోతున్నాయి. ఫలితంగా రైతుల ఆశలు నీరుగారిపోతున్నాయి. అధికారులు జోక్యం చేసుకొని ధాన్యం బస్తాలను తరలిస్తే తాము 15 రోజుల నుంచి పడుతున్న సమస్య పరిష్కారం అవుతుందని రైతులు అంటున్నారు. డబ్బుల కోసం ఎదురుచూస్తున్న ఆశ నెరవేరుతుందని బాధిత రైతులు అంటున్నారు.

Market Yard | నోట్లో బుక్క ఎత్తిపోయినట్లు అనిపిస్తుంది…

15 రోజుల కింద సిద్దిపేట మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చాము. సంచులు లేవని అన్నారు. చివరికి సంచులు తీసుకొని అమ్మకమైన ధాన్యాన్ని సంచుల్లో నింపాము. వాటిని రైస్ మిల్లులకు పంపిస్తే మాకు డబ్బులు వస్తాయని ఆశపడ్డాము. కానీ ఈడ హమాలోల్లు లారీలల్ల బస్తాలెక్కించమని అంటున్నారు. ట్రాక్టర్లు లేవాయే.. పైసలు రాకపోయే.. నోట్లో బుక్క ఎత్తిపోయినట్లు అనిపిస్తుంది.. ఎట్లా సార్ గిట్ల అయితే…?

— పిడిశెట్టి రఘు, రైతు, ఇమాంబాద్, సిద్దిపేట జిల్లా.

CLICK HERE TO READ MORE : 717 TASMAC |వారికి నో లిక్కర్

CLICK HERE TO READ MORE