కోలాహలంగా జలక్రీడల సంస్థ సమ్మర్ క్యాంపు
కోలాహలంగా జలక్రీడల సంస్థ సమ్మర్ క్యాంపు
ఈత, కయాకింగ్,కానోయింగ్ నడపటంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు
కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవి సెలవులు రావటంతో పాఠశాలల విద్యార్థులలో కొందరు ఆట పాటలలో మునిగి పోగా మరి కొందరు ఠధువుల ఇండ్లకు వెళ్లి పోయారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కొందరు విద్యార్థులు మాత్రం ఈతలో, పోటీపడవల నడపటంలో శిక్షణ పొందితే చదువుతో పాటు ఉపాధి ముందుగా దొరుకుతుందని ఉత్సాహంగా వస్తున్నారు.తల్లిదండ్రులుకూడా సదరు పోటీలను ప్రోత్సహించటంతో
నాగాయలంక కృష్ణానది లోని శ్రీరామ పాద క్షేత్రం పుష్కర ఘాట్ ప్రతి రోజూ విద్యార్థుల ఈత,పడవల శిక్షణతో కోలాహలంగా మారింది.

కృష్ణాజిల్లా జలక్రీడల సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే విద్యార్థులకు మే 1 వతేదీ నుంచి జూన్ 14 వరకు 45 రోజుల పాటు జలక్రీడలలో ఉచిత వేసవి శిబిరాన్ని నాగాయలంక కృష్ణానదిలో నిర్వహిస్తోంది.ప్రతి రోజూ ఉదయం 6:30 నుంచి 8:30 వరకు సాయంత్రం 4:30నుంచి 6:30 వరకు రోజుకీ నాలుగు గంటల పాటు వ్యాయమం,ఈత, కయాకింగ్(రెండు తెడ్లు) కానోయింగ్( ఒక తెడ్డు) చిన్న పడవలు నడపడంలో శిక్షణను నాగాయలంక వాసి,అంతర్జాతీయ జలక్రీడల క్రీడాకారిణి నాగిడి గాయత్రి, కోచ్ కన్నా కుమార్ ఇస్తున్నారు. ఈతలు,చిన్న పడవల పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. తాను ఇక్కడ పడవలో శిక్షణ పొంది, రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ జలక్రీడల పోటీలలో ఏ విధంగా ఎదిగిందో విద్యార్థులకు వివరించి జలక్రీడలు పట్ల ఆమె విద్యార్థులను ఆసక్తికలిగిస్తున్నారు.
ఈ పోటీలకు 7సంవత్సరాల వయస్సునుంచి 18 సంవత్సరాల వయస్సుగల విద్యార్థులు ఉత్సాహంగా ఈ సమ్మర్ కాంపులో పాల్గొని శిక్షణ పొందుతున్నారు.ఈత, పడవలు పోటీలో నేర్చుకుంటున్న విద్యార్థులకు లైఫ్ జాకెట్లు ధరించి కోచ్ లు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు నాగాయలంక,మోపిదేవి, గుల్లలమోద గ్రామాలనుంచి మత్స్యకార సామాజిక వర్గాలకు చెందిన 50 మంది విద్యార్థులు వస్తున్నట్లు గాయత్రి తెలిపారు. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులకు రెండు పూటలు చిక్కీలు ఇస్తున్నారు. నాగాయలంక లో రు.5కోట్ల రూపాయల వ్యయంతో జలక్రీడల అకాడమీని కృష్ణానదీ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ అకాడమీలో జలక్రీడల తరగతులు మొదలయితే నాగాయలంక కృష్ణాతీరం ఈత, పడవల శిక్షణతో సందడి సందడిగా మారనుంది.
