నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి…
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి…
- ఫార్మర్ రిజిస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
- అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నకిలీ విత్తనాల నియంత్రణ, ఫార్మర్ రిజిస్ట్రీ, పచ్చి రొట్ట ఎరువుల వినియోగం, నానో యూరియా అవగాహన తదితర అంశాలపై వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల నియంత్రణ కోసం మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖలతో పాటు విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేసి పోలీస్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ నిల్వలు, రవాణా, విక్రయాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా పచ్చి రొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచాలని, నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ద్వారానే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ పురోగతిపై క్లస్టర్ వారీగా సమీక్షించిన కలెక్టర్ గోరి కొత్తపల్లి క్లస్టర్‌లో 82 శాతం నమోదు పూర్తి కావడం పట్ల ఏఈఓను అభినందించారు. జిల్లాలో ఇప్పటివరకు 67 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయ్యిందని తెలిపారు. ప్రతిరోజూ పురోగతి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు, ఎఎస్పీ నరేష్ కుమార్, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, క్లస్టర్ ఏఈఓలు పాల్గొన్నారు.
