వడ్ల బస్తా 43 కిలోలతో తూకంలో దోపిడి…

జన్నారం, ఆంధ్రప్రభ : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాలకు బదులుగా 43 కిలోలు తూకంతో బస్తాలు కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు కనికరం అశోక్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మురిమడుగు, ఇతర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం మధ్యాహ్నం సీపీఎం మండల శాఖ ఆధ్వర్యంలో నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి 5 నుంచి 6 కిలోల వరకు అధికంగా తూకం వేస్తున్నారన్నారు.

ఈ దోపిడీని సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఆపకుంటే ఆందోళన చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని,ధాన్యం సేకరణపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని,ధాన్యం అమ్ముకొనుటకు, అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా ఉన్న ధాన్యరాసులు అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని,రైతుల బాధలు అర్థం చేసుకొని రెండు కాంటాలతో తరుగు లేకుండా తూకం వేయాలని,వడ్లు తడిస్తే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొండగుర్ల లింగన్న, నాయకులు ఎస్.కె అబ్దుల్లా,అంబటి లక్ష్మణ్, రైతులు ఎనగందుల పోషన్న, కోట రాములు,ఎం. కిష్టయ్య,బాపురావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.