కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను తక్షణమే విరమించుకోవాలి

కార్మిక వ్యతిరేక లేబర్ కోడలను తక్షణమే విరమించుకోవాలి

  • జల్లే జయరాజ్ సిఐటియు మండల కార్యదర్శి

కేసముద్రం, ఆంధ్రప్రభ : సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల ప్రతులను సీఐటీయూ నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజు మాట్లాడుతూ, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

పని గంటలను పెంచి, వేతనాలను తగ్గించే విధంగా చట్టాలు తీసుకువస్తూ, బడా పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులు, రైతులు, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నాయకులు కార్మికులకే వెన్నుపోటు పొడుస్తున్నారని, ఇటువంటి విధానాలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయకుండా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చాగంటి కిషన్, మంగీలాల్, భిక్షపతి, శ్రీనివాస్, రవి, ప్రకాష్, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.