పీవీ రావు ఆశయాలు కొనసాగిస్తాం..
పీవీ రావు ఆశయాలు కొనసాగిస్తాం..
- మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బక్కన్న
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ రావు ఆశయాలు కొనసాగిస్తామని మాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు బక్కన్న మాట్లాడుతూ.. పీవీ రావు మాలల హక్కుల పరిరక్షణ కోసం 1990లలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సామాజిక నాయకుడని పేర్కొన్నారు.
మాల మహానాడు సంస్థ ద్వారా ఎస్సీ ఉప వర్గీకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖలో మాజీ సంపాదకుడిగా పనిచేసిన పీవీ, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేపథ్యంలో ఉద్యోగాన్ని కూడా కోల్పోయారని గుర్తుచేశారు. మాల సమాజాన్ని ఏకం చేయడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. పీవీ రావు నాయకత్వంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని న్యాయపరంగా సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు వరకు పోరాటం సాగించిందని తెలిపారు.
2004లో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పులో ఎస్సీల ఉప వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, అలాంటి అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేయడం మాల ఉద్యమానికి చారిత్రాత్మక విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పుండరీకం, ప్రధాన కార్యదర్శి బి.రాజు, ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ మాజీ అధ్యక్షుడు బి.నాగయ్య, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.జనార్ధన్, తెలుగు పండిత్ ఎస్.సంజీవులు, గౌరవ అధ్యక్షుడు ఎం.విజయరావు, ఈసీ సభ్యుడు ఎన్.శ్రీనివాసులు, సబ్ రిజిస్ట్రార్ టి. అనంత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
