పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్, ఆంధ్రప్రభ : పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కిష్టాపూర్ లో స్వప్న దశరథ్ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని, నూతన గృహాలను ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు, పట్టణాలు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, బాల్ రెడ్డి, శేఖర్ గౌడ్, లింగం, నరేందర్, శ్రీకాంత్, యాదయ్య, సుధాకర్, గణేష్, సత్యనారాయణరెడ్డి, చీర్ల ఆకాష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
