26Villages | భూ సమస్యల పరిష్కారంలో నెల్లూరు అగ్రస్థానం
26Villages | భూ సమస్యల పరిష్కారంలో నెల్లూరు అగ్రస్థానం
26Villages | కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్న పాలన
‘పల్లె వీక్షణ’ కార్యక్రమంతో ప్రజలకు చేరువ
భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
జీరో పెండెన్సీ గ్రామాల దిశగా నెల్లూరు జిల్లా
ప్రజల వద్దకే పాలన తీసుకెళ్తున్న కలెక్టర్
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు పొందిన పనితీరు
క్షేత్రస్థాయి పరిశీలనతో వేగవంతమైన సమస్యల పరిష్కారం
26Villages | నెల్లూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో మరే జిల్లాలో లేని విధంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్న విధానాలు, సరికొత్త కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు పూర్తి స్థాయిలో అందేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే గతంలో భూ సమస్యల పరిష్కారంలో సరికొత్త రికార్డు సృష్టించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ”పల్లె వీక్షణ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాభివృద్ధికి సరికొత్త పునాదులను నిర్మించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్లేలా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వీలైనంత వరకు ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమైన ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ఇప్పటికే నాలుగు వారాల్లో నాలుగు గ్రామాలను సందర్శించి స్థానిక ప్రజలతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూ సమస్యల పరిష్కారం, వాటికి సంబంధించిన అర్జీల పరిశీలనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కొన్ని అర్జీల పరిష్కారం కోసం స్వయంగా క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా భూ సమస్యల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలిచింది.
సీఎం చంద్రబాబు కలెక్టర్ పనితీరును అభినందించడంతో పాటు ప్రతిఒక్కరు హిమాన్షు శుక్లాను ఆదర్శంగా తీసుకుని మిగిలిన జిల్లాల్లో కూడా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మూడు నెలల వ్యవధిలోనే 110 గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి 26 గ్రామాలు పూర్తిగా భూ వివాద రహిత గ్రామంగా (జీరో పెండెన్సీ) తయారు చేశారు. మిగిలిన గ్రామాల్లో కూడా భూ వివాదాలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ దూకుడుగా అడుగులు వేస్తూ భూ సమస్యల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలిచారు.
