రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం..

రైతుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం..

మద్దతు ధర కోసం..రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం..
మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ భారీ నిరసన.. ధర్నా..
ఎమ్మెల్సీ ఇసాక్ బాష,, సెంట్రల్ కమిటీ మెంబర్ పీపీ నాగిరెడ్డి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికొదిలేసిందని విమర్శిస్తూ వైసీపీ శ్రేణులు గళమెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గురువారం నంద్యాల టేక్కే మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, రాష్ట్ర సి ఈ సి మెంబెర్ పీ.పీ. నాగిరెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులను సకాలంలో అందించలేక ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు.రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. ఆచరణలో మాత్రం కొనుగోలు చేయకుండా రైతులను నట్టేట ముంచుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు.

కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సును విస్మరిస్తోంది” అని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రత్న బాబు చౌదరి, సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నీ సా, వైసీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శులు శివనాగిరెడ్డి, దేవనగర్ బాషా, ఆర్థర్ సైమన్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృత రాజ్, టీవీ రమణ, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు,వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.