నంద్యాల బ్యూరో, ఏప్రిల్ 5 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడిపై ప్రత్యర్థులు వేట కోడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలో వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాపరెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఇందూరి ప్రతాపరెడ్డి పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చిన వెంటనే ప్రత్యర్థులు వేట కోడవళ్లు, గోడ్డళ్లతో దాడి చేశారు.
ఈ గ్రామంలో గతంలోనూ ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. ప్రస్తుతం దాడికి గురైన బాధితుడు ప్రతాపరెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి సిరివెళ్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి అతనితో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కూడా 2017 సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంఘటన గతంలో జరిగింది. ప్రభాకర్ రెడ్డి ప్రతాపరెడ్డిల తండ్రి నారాయణరెడ్డి కూడా 1987వ సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. 2017 సంవత్సరంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి హత్య కేసు ఇటీవలే విచారణకు వచ్చిందని, అందుకే ఈ దాడి జరిగినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాపరెడ్డి హుటాహుటిన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడ్డి ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. జరిగిన సంఘటనను గురించి తెలుసుకున్నారు.

గోవింద పల్లెలో భారీ బందోబస్తు.. పోలీస్ పికెట్ ఏర్పాటు…
ఆళ్లగడ్డ తాలూకాలోని గోవిందపల్లె గ్రామంలో శనివారం వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాపరెడ్డిపై జరిగిన దాడిపై గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో సంఘటన స్థలాన్ని తనిఖీ చేయించారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో గ్రామంలో సుమారుగా వందమంది పోలీస్ బెటాలియన్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో అడుగడుగునా పోలీసులు ఉండటం విశేషం. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంపై డేగ కన్ను పెట్టారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.