80k | పాయిజన్ బాటిల్‌ను ఆర్డర్ చేసి మరీ…

80k | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: మనుషుల మధ్య సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయంటే భార్య ఆకృతి నచ్చలేదని ఏకంగా ప్రాణం తీయడం మన మానవత్వానికే మచ్చ. శరీరం పెరిగితే ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? బాధ్యతగా చూసుకోవాల్సిన భార్యను బలి చేసిన ఈ ఘటన నేటి సమాజంలో మారుతున్న విలువల పతనానికి అద్దం పడుతోంది. కడపజిల్లా ప్రొద్దుటూరులో కట్టుకున్న భార్య కాస్త లావుగా ఉందని చెప్పి ఆమెను భర్తే కడతేర్చాడు. ఆమెను పదిమందిలో తీసుకువెళ్లడం అవమానంగా ఉందట. అందుకే అంతమొందిస్తే గర్వంగా బతకొచ్చని భావించాడేమో.. ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.

ఎనిమిదేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన బద్రిపల్లి కిరణ్‌కు, ముద్దనూరుకు చెందిన పద్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఏడేళ్ల పాటు వీరి జీవితం సాఫీగానే సాగింది. పాప పుట్టిన తర్వాత పద్మ క్రమంగా బరువు పెరగడం వీరి బంధంలో చిచ్చు పెట్టింది. ఆమె ఆహార అలవాట్ల వల్లే ఇలా జరుగుతోందని అనుకున్న కిరణ్, లావుగా ఉన్న భార్యను చూసి ఇతరులకంటే తక్కువగా భావించేవాడు . చివరకు ఆమెను వదిలించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

భార్యను ఎలా చంపాలి, పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశాలపై కిరణ్ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడు. చివరకు ఆన్‌లైన్‌లో సుమారు 80 వేల విలువైన ఒక పాయిజన్ బాటిల్‌ను ఆర్డర్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం పుట్టింటిలో ఉన్న భార్యను నమ్మించి తమ ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు పద్మ తినే ఆహారంలో ఆ విషాన్ని కలిపాడు. అది తిన్న కొద్దిసేపటికే పద్మ కోమాలోకి వెళ్లిపోగా, ఆమె స్పృహలో లేని సమయంలో దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం రావడంతో కిరణ్ ను తమ స్టైల్లో విచారణ జరిపారు. దీంతో కిరణ్ చేసిన క్రూరకృత్యం బయటపడింది. ఇంతటి విషపూరిత రసాయనాన్ని ఆన్‌లైన్‌లో సప్లై చేస్తున్న ముఠా ఎవరనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆపరేషన్ ప్రారంభించారు. నిందితుడు కిరణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒక మనిషి అందాన్ని చూసి ప్రేమించడం కాదు, గుణాన్ని చూసి గౌరవించాలని అంటుంటారు. శరీర బరువు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నా, ఏకంగా ప్రాణాన్నే తీయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ ఘటన ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ప్రమాదకరమైన కెమికల్స్ నియంత్రణపై ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.