రాజకీయాల్లో కొత్త మార్పుకు సంకేతాలు
రాజకీయాల్లో కొత్త మార్పుకు సంకేతాలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సామాన్యులు గెలుపొందారు. ఇళ్లలో అంట్లు తోముతూ కుటుంబాన్ని పోషించుకునే మహిళ ఒకరైతే.. ఆటో నడిపితేనే పూట గడిచే సాధారణ డ్రైవర్ మరొకరు.. ఇంకొకరు కారు డ్రైవర్ కుమారుడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీరి గురించి నెటిజన్లలో చర్చ నడుస్తోంది.
ఇంట్లో వాళ్లతో కలివిడిగా ఉండే ఆమె తనకు తెలిసిన కొన్ని సూచనలు చేసింది. “మీరు గెలవాలంటే ఇలా చేయండి.. తమలాంటివారిని పట్టించుకోండి” అని సలహాలు ఇచ్చింది. ఆపై యజమానికి ఎందుకో ఆమె లోని రాజకీయ కోణం నచ్చి పార్టీ పెద్దలకు విషయం తెలియజేశాడు. అంతే.. ఆమె దశ తిరిగిపోయింది. బీజేపీ ఆమెను అక్కున చేర్చుకుంది. 2021లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చింది. అయితే.. అప్పట్లో ఆమె ఓటమి చెందడంతో తిరిగి ఇళ్లలో పనులు చేసుకుంటూ కాలం గడిపింది. కానీ, బీజేపీ మరోసారి ఆమెను వెతికి పట్టుకుని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లా ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఈసారి టీఎంసీ ప్రత్యర్థిపై సుమారు 12,535 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించింది. అదృష్టం ఉంటే మహిళా కోటాలో మంత్రి పదవి వరించే అవకాశముంది అని చర్చ జరుగుతోంది.
ఆటో డ్రైవర్ విజయ్ ధాము
తమిళనాడుకు చెందిన విజయ్ ధాము కూడా ఆటో డ్రైవర్ కావడం గమనార్హం. టీవీకే అధినేత విజయ్ అంటే ఆయనకు అపారమైన అభిమానముంది. ఇదే ఆయన్ని విజయ్‌కు చేరువ చేసింది. ఒక బహిరంగ సభలో అనూహ్యంగా ధాము పేరును విజయ్ ప్రస్తావించారు. చెన్నైలోని రాయపురం నుంచి ఆయనకు టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డి. జయకుమార్, డీఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్‌లను ధాము ఓడించి సంచలనం సృష్టించారు. సమీప ప్రత్యర్థిపై 14,000 పైగా ఓట్ల మెజారిటీ సాధించారు.
కారు డ్రైవర్ కుమారుడు శబరినాథన్ ఘన విజయం
టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన కారు డ్రైవర్ కుమారుడు శబరినాథన్ సంచలన విజయం సాధించారు. విరుగంబాక్కం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజాపై ఆయన ఘన విజయం సాధించి వార్తల్లో నిలిచారు. ఈయన టీవీకే అధినేత విజయ్‌కు చెందిన సొంత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు. డీఎంకే, అన్నాడీఎంకేలకు కంచుకోటగా ఉన్న ప్రాంతంలో క్షేత్రస్థాయిలో శ్రామిక వర్గాన్ని, యువతను కూడగట్టిన శబరినాథన్ విజయం సాధించారు. ఈయన కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కలితా మారీ 2021 వరకు ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించింది. ఒక రోజు ఓ ఇంట్లో పనిచేస్తుండగా స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చర్చ జరుగుతుండగా ఆమె కూడా పాల్గొంది. ఆ చర్చే ఆమె జీవితాన్ని మార్చేసింది. మన దేశంలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ గెలిచిన వారు గతంలో కూడా ఉన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
