బీజేపీ దూకుడు పెరుగుతోంది
బీజేపీ దూకుడు పెరుగుతోంది
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలదళానికి కొత్త ఊపిరినిచ్చాయి. ఆ పార్టీ (బీజేపీ) శ్రేణుల్లోనూ మరింత జోష్‌ను పెంచాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి సాధించిన విజయాలు తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా ఫలితాలు తెలంగాణలో తమ పార్టీ పటిష్టతకు దోహదపడతాయని బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో బీహార్ ఫలితాలు వెల్లడైన రోజే పశ్చిమ బెంగాల్ బీజేపీ తన ఎక్స్ ఖాతాలో “నెక్స్ట్ బెంగాల్” అని పోస్ట్ చేసింది. అన్నట్లుగానే.. తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి గట్టి పోటీ ఇచ్చి విజయం అందుకుంది.
ప్రస్తుతం ఇదే ఉత్సాహంతో బీజేపీ తెలంగాణ విభాగం కూడా “నెక్స్ట్ తెలంగాణ” అంటూ చేసిన ట్వీట్, రాష్ట్ర రాజకీయాల్లో పాగా వేయాలన్నదే లక్ష్యం అని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో కాషాయ జెండా బలోపేతానికి, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా వ్యూహాలు రూపొందించేందుకు పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు బీజేపీ దూకుడుగా అడుగులు వేస్తోంది.
ప్రధాని సభతోనే సమరశంఖం
పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఘన విజయాలతో జోష్‌లో ఉన్న కేంద్ర నాయకత్వం, ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించింది. ఈ వ్యూహంలో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో సుమారు రూ.8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందనే సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం. ఈ పర్యటన తెలంగాణలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, రాజకీయ వాతావరణం మారుతుందని అంచనా వేస్తున్నారు.
మోదీ చరిష్మాతో ముందుకు
తెలంగాణలో పట్టు సాధించేందుకు మోదీ చరిష్మాను ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును ఆసరాగా చేసుకుని కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. కేవలం భావోద్వేగ అంశాలే కాకుండా, కేంద్ర పథకాల లబ్ధిదారులను ఓటు బ్యాంకుగా మార్చుకునేలా ప్రధాని ప్రసంగం ఉండనుంది. అధికార కాంగ్రెస్, బలహీనపడిన బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ ఖాళీని భర్తీ చేయడమే లక్ష్యంగా కమలదళం ముందుకు సాగుతోంది.
యూత్ ఫార్ములా
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ జెన్-జీ యువతను ఆకట్టుకుని ఎలా ప్రభంజనం సృష్టించిందో, అదే తరహాలో తెలంగాణలో కూడా యూత్, డెవలప్‌మెంట్ ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి పోలింగ్ బూత్‌లో డిజిటల్ వాలంటీర్లను నియమించి, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. అటు హిందుత్వ అజెండాను కొనసాగిస్తూనే, ఇటు మౌలిక సదుపాయాల కల్పన, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలని భావిస్తోంది.
అలాగే, బీసీ అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తూ సామాజిక న్యాయం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 2029 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీకి ఊపిరి పోశాయని, భవిష్యత్తులో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ మరింత తీవ్రమవుతుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ రణరంగంలో బీజేపీ ఏ మేరకు పట్టు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
