గడ్డం తీస్తే హాజరు లేదా..

గడ్డం తీస్తే హాజరు లేదా..

  • ఉపాధి కూలీ ముఖానికి బురద పూత
  • ఏకే తండలో వింత పరిస్థితి..
  • ఫోటో ఆధారిత హాజరుతో చిక్కులు

రాయపర్తి, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకంలో ఫోటో ఆధారిత హాజరు విధానం కూలీల పాలిట శాపంగా మారింది. గడ్డం తీసిన కారణంగా హాజరు నమోదు కాకపోవడంతో ఓ కూలీ ముఖానికి బురద పూసుకుని హాజరు వేయించుకున్న ఘటన రాయపర్తి మండలం ఏకే తండ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. మంగళవారం మండలంలోని ఏకే తండకు చెందిన ఉపాధి హామీ కూలీ హలావత్ జామ, జాబ్ కార్డు నెంబరు 214. ఇతను నిన్నటి వరకు గడ్డంతో ఉన్నాడు. నిన్న తీసిన ఫోటోతో హాజరు నమోదైంది.

అయితే ఇవాళ గడ్డం తీసేసి పనికి వెళ్లడంతో యాప్‌లో ముఖం గుర్తించలేక హాజరు తీసుకోవడం లేదని,ఫీల్డ్ అసిస్టెంట్ ఎంత ప్రయత్నించినా యాప్ ఒప్పుకోలేదని, దీంతో చేసేది లేక కూలీ హలావత్ జామ తన ముఖానికి బురద అంటించుకున్నాడు. గడ్డం ఉన్న చోట బురద పూసి, నిన్నటి ఫోటోకు దగ్గరగా కనిపించేలా చేసిన తర్వాత యాప్‌లో హాజరు నమోదైందన్నారు.

ఫోటో ఆధారిత హాజరులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తరచూ వస్తున్నాయని, గడ్డం, మీసం, తలపాగా వంటి వాటి వల్ల ముఖం గుర్తించడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. దీనివల్ల కూలీలు నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, వేలిముద్ర లేదా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసి, కూలీలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply