డబ్బు కట్టేది పెట్రోల్‌కు.. వచ్చేది నీళ్లా?
డబ్బు కట్టేది పెట్రోల్‌కు.. వచ్చేది నీళ్లా?
- నాణ్యత గాలికొదిలేసిన పెట్రోల్ బంకులు..
- కల్తీ భూతానికి బలవుతున్న బైకులు
- ఇంజన్లు పాడైతే బాధ్యులెవరు అంటూ వాహనదారుల ఆగ్రహం
రాయపర్తి, ఆంధ్రప్రభ : “లీటర్‌కు వంద రూపాయలు కట్టేది పెట్రోల్‌కు.. కానీ ట్యాంక్‌లోకి వచ్చేది నీళ్లా?” అంటూ రాయపర్తి వాహనదారులు మండిపడుతున్నారు. నాణ్యతను గాలికొదిలేసిన పెట్రోల్ బంకుల తీరుతో కల్తీ భూతానికి బైకులు బలవుతున్నాయని వాపోతున్నారు. స్థానికంగా ఓ వాహనదారుడు తన బైక్ మధ్యలో ఆగిపోవడంతో అనుమానం వచ్చి ట్యాంక్‌లోని ఇంధనాన్ని బాటిల్లోకి తీశాడు. అది ముదురు పసుపు రంగులో, అడుగున నీటి మాదిరి అవశేషాలతో కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు.
వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.”రోజురోజుకూ పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. కానీ నాణ్యత మాత్రం పట్టించుకోవడం లేదు. కల్తీ పెట్రోల్ వల్ల ఇంజన్లు సీజ్ అవుతున్నాయి. రిపేర్‌కు వేల రూపాయలు ఖర్చు అవుతోంది. దీనికి బాధ్యులెవరు?” అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.పెట్రోల్ బంకుల్లో రోజువారీ నాణ్యతా పరీక్షలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? లేక లాభాల కోసం కావాలనే కల్తీకి పాల్పడుతున్నారా? అనే అనుమానాలు వాహనదారుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.
కల్తీ ఇంధనంపై ఫిర్యాదులు వస్తున్నా తనిఖీలు మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రతి బంకులో ఆకస్మిక తనిఖీలు చేయాలని, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
