ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

–తొర్రూరు ఆర్డీవో గణేష్
–తొలి రోజు 20 దరఖాస్తుల స్వీకరణ

తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీవో గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రారంభించిన ప్రజావాణిలో స్థానికులు నుంచి 20 దరఖాస్తులు అందాయి. దానిలో 15 రెవెన్యూ కు,5 పంచాయతీ రాజ్ కు సంబంధించినవి ఉన్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో భూ సంబంధిత, వ్యక్తిగత సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, చిన్న గూడూరు, నరసింహుల పేట మండలాలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

ఆర్డీవో మాట్లాడుతూ… ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. వచ్చిన దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని,అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

అధికారులు భూ సమస్యలు పరిష్కరించాలి: చిత్తలూరి సతీష్
మండలంలోని నాంచారి మడూరు గ్రామ శివారులోని నవోదయ హై స్కూల్ నిర్వాహకులు చిత్తలూరి సంధ్యారాణి,సతీష్ దంపతులు గ్రామంలో 4-28 ఎకరాలు కొనుగోలు చేసి 1993లో రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా ఇటీవల కొందరు కబ్జాదారులు భూమిపై కన్నేసి 35 గుంటల భూమిని హోల్డ్ లో పెట్టించారని, దాంతోపాటు పాఠశాలకు ఎదురుగా ఉన్న 32 గుంటల భూమిని సైతం హోల్డ్ లో పెట్టించారని, దాన్ని హోల్డ్ నుంచి తొలగించి సమస్య పరిష్కరించాలని కోరారు.

ప్రజావాణిలో డిఎల్ పిఓ పుల్లారావు,ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, విద్యుత్ శాఖ డిఈ రవి, హౌసింగ్ ఏఈ యాకన్న, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ఏటి డబ్ల్యూ ఓ ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్ నాయక్, సిడిపిఓ కమలాదేవి, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్,ఏవో రాంనర్సయ్య, డాక్టర్ జ్వలిత పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply