బూడిదతో రాజుకున్న మంటలు

బూడిదతో రాజుకున్న మంటలు

రాయపోల్ , ఆంధ్రప్రభ: రాయపోల్ మండలం చిన్న మాసన్‌పల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు రైతులను కుదిపేసింది. గ్రామానికి చెందిన గూని స్వామి, సొక్కం కిష్టయ్యలకు చెందిన గడ్డివాములు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సుమారు 120 కట్టల ఎండుగడ్డి అగ్నికి ఆహుతై భారీ నష్టం సంభవించింది.

స్థానికుల వివరాల మేరకు… సొక్కం నర్సింలుకు చెందిన పెంటలో కాలిన బూడిదను పక్కన వేయడంతో అందులోని మంటలు మళ్లీ చెలరేగి, సమీపంలోని గడ్డివాములకు అంటుకున్నాయి. ఎండుగడ్డి ఉండటంతో క్షణాల్లోనే మంటలు విస్తరించి గడ్డివాములను మింగేశాయి. మంటలను గమనించిన గ్రామస్థులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినా, అప్పటికే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఈ ఘటనతో పశువులకు నిల్వ ఉంచిన ఆహారం కోల్పోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.