కోతుల బెడదకు.. మరో ప్రాణం బలి..

కోతుల బెడదకు.. మరో ప్రాణం బలి..

భూపాలపల్లిలో విదారకర ఘటన..
జవహర్‌ నగర్‌లో విషాద ఛాయలు..
అధికారుల పై మండిపడుతున్న ప్రజలు..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల బెడద మరొకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. జవహర్‌నగర్ కాలనీలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకురావడంతో..భయంతో పరుగు తీస్తూ పడిపోవడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

భయంతో పరుగు.. తలకు తీవ్ర గాయాలు..
గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న హరికృష్ణ పై కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకురావడంతో అతను భయంతో ఇంట్లోకి పరుగులు తీశాడు. ఈ క్రమంలో కాలుజారి రాయి పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో జవహర్‌నగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇంటి ముందు నిలబడలేం… బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది… పిల్లలు, వృద్ధులు ఎవరూ సురక్షితం కాదు” అంటూ స్థానికులు వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం పై ప్రజల ఆగ్రహం..
కోతుల సమస్య పై పలుమార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించి కోతులను పట్టిస్తామని చెప్పడం తప్పా ఆచరణలో ఎలాంటి చర్యలు లేవని విమర్శిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో కోతులను పట్టించేందుకు తీర్మానాలు చేసినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు అంటున్నారు. పట్టణంలో రోజుకో ప్రాంతంలో కోతుల దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.

సమన్వయం పేరుతో కాలయాపన..?
మున్సిపాలిటీ, సింగరేణి సమన్వయం పేరుతో చర్చలు జరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. “మాకు ఇంకేం అవసరం లేదు… కనీసం కోతుల బెడద నుంచి రక్షణ కల్పించండి” అంటూ అధికారులు, నాయకులను నిలదీస్తున్నారు. ఈ ఘటన తర్వాత అయినా సంబంధిత అధికారులు స్పందించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply