ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం

ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేసిన తర్వాత వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి చేయవద్దన్న నిబంధనను హైకోర్టు గురువారం తప్పుబట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారానికి సంబంధించిన గడువు నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం జారీ చేసిన జీ.ఓ. 7లోని 5వ పేరా, 12వ నిబంధనను పరిశీలిస్తే, ఇటీవల ఇదే హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నేపథ్యంలో ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సవాల్ చేస్తూ పలు ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఏప్రిల్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అవినాశ్ దేశాయ్, ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ, గత ఉత్తర్వుల ప్రకారం కౌంటర్లు దాఖలు చేయకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు గడువు గురించి చెప్పకుండా ప్రభుత్వం ఈనెల 29న జీ.ఓ. 7 జారీ చేసిందన్నారు.

ఈ జీ.ఓ. ప్రకారం విద్యార్థుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 2న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. జీ.ఓ.లోని 5వ పేరా, 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని, ఆ తరువాత విద్యార్థులు టీఎస్‌ఏఆర్‌సీ నిర్ణయించిన మొత్తాలను కాలేజీలకు చెల్లిస్తారని పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేకపోతుందని, ఆ నిబంధనను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం జీ.ఓ.ను 29న విడుదల చేసినట్లు ఉదయం తెలిసిందన్నారు. పిటిషనర్లు ప్రస్తావించిన నిబంధన గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అంగీకరించారు. దీనిపై వివరణ ఇవ్వడానికి సోమవారం వరకు గడువు కావాలని కోరారు. అంతేకాకుండా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు గడువు, ఏఏ కాలేజీలకు టోకెన్లు జారీ చేశారో వంటి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి కూడా గడువు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి, ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.లోని నిబంధనను ప్రాథమికంగా పరిశీలిస్తే గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇది కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అడ్మిషన్ల సమయంలో ఫీజు వసూలు చేయాలన్న నిబంధనపై వివరణ ఇవ్వడానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సోమవారం వరకు గడువు కోరిన నేపథ్యంలో, ఈ నిబంధనను మే 4వ తేదీ వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు.

Leave a Reply