క్రీడాకారులపై అక్రమ కేసులు దారుణం..

క్రీడాకారులపై అక్రమ కేసులు దారుణం..
అక్రమ కేసులపై శాప్ ఎండీకి క్రీడా సంఘాల ఫిర్యాదు..
25 సంఘాల ప్రతినిధుల భేటీ..
వేధింపులు నిలిపివేయాలంటూ వినతి..
గుర్తింపు లేని సంఘాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎండీ భరణి..
విజయవాడ, ఆంధ్రప్రభ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండీ భరణిను 25 క్రీడా సంఘాల ప్రతినిధులు కలిసి అక్రమ కేసులు, వేధింపులపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సంఘాల సమస్యలను వివరించారు. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతో కేసులు బనాయించడం క్రీడా రంగానికి హానికరమన్నారు.
క్రీడాకారుల తప్పిదాలపై చర్యలు అవసరమే కాని, మొత్తం సంఘాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని తెలిపారు. డేట్ ఆఫ్ బర్త్ వివాదాలపై హైకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ కార్యదర్శి వెంకట్ నామిశెట్టి గుర్తింపు లేని సంఘాలు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.

పోలీసులను అడ్డంగా పెట్టుకుని అసలైన సంఘాలను బెదిరిస్తున్నారని విమర్శించారు. అధికారిక గుర్తింపు ఉన్న సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రీడా సంఘాల విన్నపాలపై ఎండీ భరణి సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం నిర్వహించే క్రీడా కార్యక్రమాల్లో గుర్తింపు పొందిన సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంఘంతో విడిగా సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆకుల రాఘవేంద్రరావు, ఆర్.డి. ప్రసాద్, హాకీ హర్ష, దామోదరరావు, సురేంద్ర రెడ్డి, మదక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
