ఎన్నికల హామీలు గాలికేనా..?

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కన్నాయిగూడెం ప్రజలు
హామీలు నిలబెట్టుకుని గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత వాటిని విస్మరించారని కన్నాయిగూడెం మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

కన్నాయిగూడెంలో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాల కారణంగా పరిస్థితి మరింత దిగజారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద కూడా పెరిగిందని, సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలను పలుమార్లు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.