మైనారిటీల అభ్యున్నతికి ఎంపీ చిన్ని కృషి
- పార్లమెంట్ వేదికగా గళం విప్పిన ఎంపీ చిన్ని
- పీఎం జనవికాస్ నిధులకు కేంద్రం ఆమోదం
- మైనారిటీలకు రూ.8.76 కోట్లకు గ్రీన్ సిగ్నల్..!
- మైనారిటీల అభివృద్ధికి ఎంపీ చిన్ని కృషి
- ఎంపీ చిన్ని చిత్రపటానికి పాలాభిషేకాలు
విజయవాడ, ఆంధ్రప్రభ: మైనారిటీల అభ్యున్నతి, సంక్షేమానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్ వేదికగా ప్రస్తావించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మైనారిటీ వర్గాలు ఘనంగా అభినందనలు తెలిపాయి. ఎంపీ చిన్ని పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్న నేపథ్యంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద రూ.8.76 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మైనారిటీ నాయకులు ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లబ్బీపేటతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మైనారిటీ వర్గాలకు చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ కరీముల్లా మాట్లాడుతూ, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, ఆర్థిక పురోగతి వంటి అంశాలపై ఎంపీ కేశినేని చిన్ని పార్లమెంట్లో ప్రశ్నించడం అభినందనీయమన్నారు. గత ఐదేళ్లలో మైనారిటీల సమస్యలను ఈ స్థాయిలో పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భాలు కనిపించలేదని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26 సంవత్సరంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద రూ.101 కోట్ల నిధులు కేటాయించగా, తాజాగా ఎంపీ చిన్ని పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం మరో రూ.8.76 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించడం మైనారిటీల అభ్యున్నతికి దోహదపడే నిర్ణయమని అన్నారు. ఈ నిధులతో మైనారిటీ ప్రాంతాల్లో విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. మైనారిటీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించడంలో ఎంపీ చిన్ని చూపుతున్న చొరవకు జిల్లా వ్యాప్తంగా మైనారిటీలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు.
భవిష్యత్తులో కూడా మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని తీసుకునే ప్రతి ప్రజాహిత కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని షేక్ కరీముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ నాయకులు ఫిరోజ్, షరీఫ్, సిరాజ్, నూరుద్దీన్, కరీం, ఎం.డి. ఇంతియాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మైనారిటీ మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
