ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్
పరకాల, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మెరుగు ప్రసన్న డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మెరుగు ప్రసన్న మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. అయితే నెల మొదటి తేదీన జీతాలు రావడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
పీఆర్సీ ప్రకటించడం, పెండింగ్ డీఏలు చెల్లించడం, సీపీఎస్ రద్దు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, నూతన పోస్టుల మంజూరు వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు నాలుగు దశల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
మొదటి దశలో ఆగస్టు 7న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి పీఆర్సీ ప్రకటించే వరకు విధులకు హాజరవుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రెండో దశలో ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.
మూడో దశలో ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాలుగో దశలో ఆగస్టు 29న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబరులో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టేందుకు యూఎస్పీసీలో భాగస్వామ్యమైన టీఎస్‌యూటీఎఫ్ పిలుపునిచ్చిందని మెరుగు ప్రసన్న తెలిపారు.
జిల్లా ఉపాధ్యక్షుడు రాజారాం మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిక్షపతి, మహేందర్ సింగ్, నవీన్, పీజీ హెచ్ఎంలు సాంబయ్య, మధు, భాస్కర్‌తో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
