ఆశాజనకంగా ఎస్సారెస్పీ నీటిమట్టం
మీమాంసలో ఆయకట్టు రైతులు
బాల్కొండ, ఆంధ్రప్రభ: తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) పరిధిలో ఖరీఫ్ సాగునీటి విడుదలపై రాష్ట్రస్థాయి ‘శివం కమిటీ’ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పూర్వపు ఉమ్మడి ఐదు జిల్లాల రైతుల్లో ఆందోళన నెలకొంది. కమిటీ తన తదుపరి సమావేశాన్ని మరో 15 రోజులకు వాయిదా వేయడంతో సాగునీటి అంశం మరింత అనిశ్చితిలో పడింది.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తెలంగాణలోని చాలా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఇతర ప్రాజెక్టులతో పోలిస్తే శ్రీరాంసాగర్‌లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. ప్రతి ఏడాది మాదిరిగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సుమారు 9.50 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సాగునీరు అందించాలంటే ఎస్‌ఆర్‌ఎస్‌పీలో కనీసం 53 టీఎంసీల నీటి నిల్వ అవసరమని అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం నాటికి ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి సుమారు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. అయితే ఖరీఫ్ సాగుకు అవసరమైన స్థాయికి చేరుకోవాలంటే ఇంకా 13 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
గురువారం హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఈఎన్‌సీ రమేష్‌బాబు అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ‘శివం కమిటీ’ (సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ రాష్ట్రస్థాయి కమిటీ) సమావేశం జరిగింది. చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశాన్ని 15 రోజుల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా, ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇంకా పూర్తిస్థాయిలో లేకపోవడం, కమిటీ కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. నాట్లు ప్రారంభించాలా? లేక మరికొంతకాలం వేచి చూడాలా? అనే అయోమయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, నీటిపారుదల శాఖ త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
