భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే

భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శనివారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించబడింది. మహా మండపం నాలుగవ అంతస్తులోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్‌లో నిర్వహించారు. గత కొంతకాలంగా వరుస ఉత్సవాలు, పండగలు, భక్తుల రద్దీ కారణంగా సిబ్బంది అంతా భక్తుల సేవలో నిమగ్నమై ఉన్నందున ఇటీవల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించలేకపోయామని….అయితే, భక్తుల సౌకర్యార్థం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సంక్షేమం కూడా అంతే ముఖ్యమని భావించి సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు ఈవో వీకే శీనా నాయక్ తెలిపారు.
అన్ని కేడర్లకు చెందిన ఆలయ సిబ్బంది ఈ గ్రీవెన్స్‌లో పాల్గొని, తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలను నేరుగా కార్యనిర్వహణాధికారి వారికి వివరించారు. అధికారుల హాజరు: ఈ కార్యక్రమానికి డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, సూపరెండెంట్స్ హాజరై, సమస్యల పరిష్కారానికి అవసరమైన డేటాను అందించారు. సిబ్బంది అందించిన వినతులను పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమైందని, వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా మరింత మెరుగైన సేవలు భక్తులకు అందించడానికి మార్గం చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అన్ని విభాగాల ఏఈవోలు వారి విభాగాల్లో ఉన్న సమస్యలు గురించి ఈవో కి వివరించారు. ఉచిత బ్యాటరీ వాహనాల రాకపోకల మెరుగుదల,దేవస్థానం హాస్పిటల్ లో ఇంకా సౌకర్యాల పెంపుదల, సేవాదారుల సేవల పెంపుదల, పారిశుధ్య సేవలు మరింత మెరుగు పర్చడం గురించి తగు చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.

